బీజేపీతో బంధంపై అనుమానాలొద్దంటున్న శివసేన అధిపతి
బీజేపీతో సుదీర్ఘ అనుబంధంపై తాము పునరాలోచనలో పడ్డట్టు వస్తున్న వార్తలను శివసేన అధిపతి ఉద్ధవ్ థాకరే కొట్టిపారేశారు. బీజేపీతో తమ బంధం ఇప్పటికీ పటిష్ఠంగానే ఉందని స్పష్టం చేశారు. ఇటీవలే తాము శివసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతామని రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ప్రకటించింది. అయితే, బీజేపీ నేత నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దూరం కానుందని వార్తలొచ్చాయి. దీనిపై స్పందిస్తూ, ఉద్ధవ్ థాకరే పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాశారు. బీజేపీ, శివసేనల మైత్రి ఈ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనదని అభివర్ణించారు. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ఆ బంధం దృఢమైనదని పేర్కొన్నారు.